రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరినీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ద్వారా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటా సర్వే ద్వారా సుమారు 32వేల మందిని కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరిగిందని వారందరికీ టెస్టులు నిర్వహించాలని చెప్పారు. ఈవిధంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారందరినీ టెస్టు చేయడం వల్ల మరణాలను పూర్తిగా తగ్గించవచ్చని చెప్పారు.
ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని అన్నారు.ఈయాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా సులభం అవుతుందని తెలిపారు.గ్రామాల్లో పనులు చేసేందుకు బయిటకు వెళ్ళేవారు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు.ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలకు సరిపడినన్ని ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపడం జరిగిందని వాటిని సక్రమంగా వినియోగించి టెస్ట్లు నిర్వహించాలని చెప్పారు.ఈ విధంగా టెస్ట్లు నిర్వహణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించారు.
అదే విధంగా జిల్లాలకు హైడ్రో క్లోరోక్విన్ మాత్రలను పంపడం జరిగిందని వాటిని ఫ్రంట్ లైన్ వర్కర్లు అందేలా చూడాలని ఆదేశించారు.ఈనెల 30 వరకూ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోందని కావున కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారిని జిల్లాలో గల కోవిడ్ కేర్ కేంద్రాలలో ఉంచి వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.ఈవీడియో సమావేశంలో టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు,వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, ఆరోగ్య శ్రీ సిఇఒ మల్లికార్జున్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.