200 రోజుల రాజధాని రైతుల పోరాటంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్!


    రాజధాని రైతుల పోరాటం 200 రోజులకు చేరిన నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్.అమరావతి రాజధానికి దేశచరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా ల్యాండ్ ఫూలింగ్ ద్వారా 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు చేపట్టిన పోరాటం 200వ రోజుకు చేరుకుంది.రాజధానిని మార్చాలనే నిర్ణయంతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డికి తగదు.కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న అమరావతికి ఓ వైపు పుష్కలంగా తాగునీరు, మరో వైపు నేషనల్ హైవే ఎంతో సౌకర్యవంతం.


    ఇటు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలతో పాటు అటు గుంటూరు,కృష్ణా, గోదావరి జిల్లాలకు ఎంతో అనుకూలమైన ప్రాంతం అమరావతి.ఏదో మారుమూల ప్రాంతంలో రాజధాని ఉండుంటే ప్రజల సౌకర్యార్ధం మారుస్తున్నామంటే అర్ధం ఉండేది.సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని ఇది.దేశంలోని అన్ని పార్టీల నాయకులతో పాటు పలువురు వైసీపీ నాయకులు కూడా అమరావతిని సమర్ధిస్తున్నారు.


    కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజధానిగా అమరావతి వద్దని గుండెపై చేయి వేసుకుని చెప్పగలరా.చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఇలా చేయడం దుర్మార్గం.రాజకీయాల్లో పట్టువిడుపులు అవసరం.ఒక 2 వేల కోట్లు ఖర్చు పెడితే అధునాతమైన, సౌకర్యవంతమైన, బ్రహ్మాండమైన రాజధాని అందుబాటులోకి వస్తుంది.మీరే పూర్తి చేయండి,మీ పేరే చిరకాలం నిలిచిపోతుంది.రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించండి.


    ఇంత సౌకర్యవంతమైన రాజధాని దేశంలో ఎక్కడా రాబోదు.ఇప్పుడు మీరు దానిని శిథిలాల కింద మార్చడం బాధాకరం.భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులు భార్యాపిల్లలతో 200 రోజులుగా నిరంతర పోరాటం చేస్తూ అందరి మనస్సుల్లో నిలిచిపోయారు.రాజధాని కోసం పోరాటం సాగిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు,మీకు మా పూర్తి మద్దతుంటుంది.రాజధానిని అమరావతి నుంచి ఎవరూ కదిలించలేరు.