దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇవాళ్టికి 73 ఏళ్లు పూర్తై 74వ ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చీకటి నుంచి వెలుగుకి, వెనకబాటు నుంచి అభివృద్దికి, బానిసత్వం నుంచి స్వతంత్య్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలు కని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం ధారపోసిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.ఆనాడు పెద్దలు ఎందరు త్యాగాలు చేశారో.. మన చరిత్రలో, మన గుండెల్లో, మన భావాల్లో ఎప్పటికీ గుర్తుండాలి. స్వాతంత్య్రం విలువ, జాతీయ జెండా విలువ, దేశభక్తి గొప్పతనం, ఈ దేశంలో ప్రతి పౌరుడి నరనరాన నిండాలి. బానిసత్వం ఎంతటి ఘోరమో తెలియాలి. జీవించే హక్కు కూడా లేని సమాజాలు, లా అండ్ ఆర్డర్ కూడా లేని సమాజాలు, కొద్ది మంది మాటే చెల్లుబాటయ్యే సమాజాలు ఎలా ఉంటాయో మనందరికి కూడా తెలియాలి.
రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని, ఏ సమాజానికి అయినా అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడు కూడా గుర్తుంచుకోవాలి.మహాత్మా గా«ంధీ గారు చెప్పిన రెండు వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను.‘మన స్వాతంత్య్రం విలువను ఎవరూ లెక్క కట్టలేరు. అది మనకు ప్రాణవాయువు లాంటిది. ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఒడిగడతాడో, ఒక జాతి కూడా స్వాతంత్య్రం కోసం అంతటి త్యాగానికి ఒడి గడుతుంతి’ అన్నది మహాత్ముడి మాట.‘ఈ దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను అవకాశాల్లో కానీ, హోదాల్లో కానీ దేశ ప్రజలందరి మధ్య సమానత్వం పెంపొందింప చేస్తామని రాజ్యాంగలోని తొలి పలుకులుగా మనకు మనం నిర్దేశించుకున్నాం.
అటువంటి స్వతంత్య్రం కోసం ఈ రాష్రంలోని ప్రతి కుటుంబానికి కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం సహకరిస్తూ నవరత్నాల పాలన అందిస్తోందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాను.ఈ క్రమంలోనే గత 14 నెలలుగా స్థిర సంకల్పంలో అడుగులు ముందుకు వేశాం. మరో 10 ఏళ్ల తర్వాత, మరో 20 ఏళ్ల తర్వాత.. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరికులమ్‌తో పాటు, పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం.చదువుకునే హక్కు మీకుందని రాజ్యాంగంలో రాసిన వాక్యాలు ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం గుర్తించి, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్ మీడియమ్‌ను ఒక హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, చదువే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చాం.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.ఆరోగ్యశ్రీలో జబ్బులు మరో 1000కి పైగా పెంచి 2200 జబ్బులు ఇవాళ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. అంతే కాకుండా రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింప చేశాం. రూ.1000 కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరి«ధిలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎక్కడా లేని విధంగా దాదాపు 1100 వాహనాలు కొని ఒకేసారి 108, 104 సేవల కోసం పంపించాంఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి త్యాగం చేసిన మహానుభావులను, వ్యక్తులను ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడ్డానికి నిరంతరం సైనికుల్లా పని చేస్తున్న సేవకులందరికీ కూడా ఈ సందర్భంగా మనం అందరం సెల్యూట్ చేద్దామని అడుగుతా ఉన్నాను. ప్రతి డాక్టర్‌కూ, ప్రతి నర్సుకూ, ప్రతి ల్యాబ్ టెక్నీషియన్‌కూ, ప్రతి పోలీసుకూ, ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికీ, ప్రతి ఆశా కార్యకర్తకూ, ప్రతి వలంటీర్‌కూ, వలంటీర్ నుంచి మొదలు చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను.