యువతకు శుభవార్త


 వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా విశాఖ


 రాష్ట్రంలో రెండు భారీ పెట్రో కెమికల్ ప్రాజెక్టులు


డిసెంబర్ 15 కల్లా రామాయపట్నం, భావనపాడు పోర్టుల పనులు ప్రారంభం


ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ లక్ష్యం  


     (స్ప్రెడ్ న్యూస్ ) అమరావతి;- రాష్ట్ర యువతను ప్రపంచస్థాయి నైపుణ్యం గల వారిగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ధ్యేయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటు ద్వారా యువత స్వప్నాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐఎల్, బీహెచ్ఈఎల్, కాంకొర్ సంస్థలు సీవోఈ ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లతో పాటు, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక తోడ్పాటునందించేందుకు కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.  


    గత వారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో ఢిల్లీలో భేటీ అయినపుడు.. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలను వివరించినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. రాష్ట్రంలోని 8 ఫిషింగ్ హార్బర్లకు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ఆర్థిక సాయం, అవసరమైన పెట్టుబడులు, జాతీయ రహదారుల అనుసంధానానికి సహకరిస్తుందని.. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ హామీ ఇచ్చినట్లు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లో భాగంగా మన రాష్ట్రానికి కచ్చితంగా రెండు పెట్రో కెమికల్ ప్రాజెక్టులు రానున్నట్లు ప్రకటించారు. సీవోఈతో పాటు సోలార్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకూ బీహెచ్ఈఎల్ ఆసక్తి కనబరుస్తోందన్నారు.


    పరిపాలన రాజధాని విశాఖను రానున్న రోజుల్లో ఐ.టీ హబ్ గా అభివృద్ధి చేయడంతో పాటు.. ‘‘వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్’’ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఊహించని స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే భావనపాడు, రామాయపట్నం పోర్టుల డీపీఆర్ సిద్ధం కాగా.. డిసెంబర్ 15 కల్లా పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. బోర్డు సమావేశం అనంతరం సోలార్ ప్లాంట్ పై కేంద్రం స్పష్టతనిచ్చే అవకాశం ఉందన్నారు.