అనంతరం, కేంద్ర ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీతో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వమ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రతిపాదించారు. అందుకు అజయ్ సాహ్నీ సానుకూలంగా స్పందించారు. మరో ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలోని గ్రామ సచివాలయం సహా అన్ని శాఖల్లోని ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు ఆర్థికంగా మరింత సాయాన్ని అందించవలసిందిగా మంత్రి మేకపాటి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి ఆయనకు వివరించారు. డిజిటల్ ఇండియాపై జరిగిన చర్చలో రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనలో డిజిటలైజేషన్ దిశగా చేపట్టిన అనేక చర్యలను మంత్రి గౌతమ్ వివరించారు.
కేంద్ర పరిశ్రమలు, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. పోర్టుల అభివృద్ధిలో సీఎం, మంత్రి మేకపాటి చూపిస్తున్న చొరవ పట్ల కేంద్ర మంత్రి పీయూష్ ఆశ్చర్యంగా అభినందించారు. పాత రాయితీలు చెల్లించిన తర్వాతే కొత్త రాయితీల గురించి ఆలోచించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈడీబీలో ఏఫీ ఫస్ట్ నిలవడంపైనా ఆయన ప్రశంసించారు. మంత్రి మేకపాటి ప్రతిపాదన చర్చలలో కీలకమైన విశాఖపట్నం-చెన్నయ్, చెన్నయ్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ హామీ ఇచ్చారు.
ఏపీలో ఎలక్ట్రానిక్ రంగంలో రాబోతున్న పెట్టుబడులపైనా, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ వంటి కీలక ప్రాజెక్టులలోనూ కేంద్ర సాయం ఉంటుందని మంత్రి మేకపాటి ప్రతిపాదనలకు పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ప్రత్యేకించి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై ఒక కమిటీ వేసి, అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు పీయూష్ గోయల్. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పశ్చిమ మెట్ట మండలాలను కలిపే శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైన్ పనులు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి గౌతమ్ రెడ్డి. బిట్రగుండలోని రైల్ ఇంజన్ మరమ్మతుల కర్మాగారంపైనా మంత్రి మేకపాటి చర్చించారు.