కోటి జనాభా ఉన్న ఉత్తరాంధ్రకు నవశకం పార్ట్-2


     స్ప్రెడ్ న్యూస్ ;- .హైదరాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డూలాగే... మందస కోవాకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించేందుకు కృషి చేస్తాం. అదే లభిస్తే దేశంలోనే  ఒక మంచి స్వీట్ బ్రాండ్ గా మారే అవకాశముంది . అనకాపల్లి బెల్లంది కూడా అదే పరిస్థితి..ఉపాధి అవకాశాల్లేకుండా ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. ఈ కోణంలో వస్త్రపరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పొందూరు ఖర్దరు, అక్కడ పనితనం చూసి మహాత్మాగాంధీయే ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి అమెరికా, డెన్మార్క్, జపాన్, స్వీడన్ , బ్రిటన్ కు ఖాదీ ఎగుమతులుండేవి. వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తాం.


   విద్యారంగం అభివృద్ధి చాలా కీలకం. ఉత్తరాంధ్రలోని దందపురి లాంటి చోట్ల తక్షశిల, నలందకన్నా ముందే యూనివర్సిటీ ఉండేదని చరిత్ర చెబుతుంది . వేల సంవత్సరాల నుంచే నాగరికత ఉంది. ఆ వైభవాన్ని కాపాడుకుంటూనే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం.   వెయ్యేళ్ల క్రితం నిర్మించిన రామతీర్థం - పైడితల్లి అమ్మవారిని జనం కొలుస్తారు.  అయితే విజయనగరం ఎదుర్కొంటున్న  జనపనార, ఫెర్రో ఇండస్ట్రీ లాంటి పారిశ్రామిక సవాళ్లను పరిష్కరిస్తాం.


     ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా టూరిజం అభివృద్ధి చెందేందుకు స్కోపున్న ప్రాంతం ఉత్తరాంధ్ర. అరుదైన అందాలకు ఆటపట్టు - తూర్పున నీలి సముద్రం, పశ్చిమాన పచ్చని  శ్రేణులు - సహజసిద్ధ జలపాతాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. బౌద్ధ ఆరామాలు వెలిశాయి, సుందర బీచ్ లు కట్టిపడేస్తాయి. అందుకే మూడు జిల్లాల్లోనూ తీర ప్రాంతాన్ని పర్యాటకానికి మరింత అనుకూలంగా మలుస్తాం... పర్యాటకులకు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతాం. శ్రీకాకుళం జిల్లాలోని తేలనీలాపురం, తేలుకుంచి లాంటి పక్షి కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. చింతపల్లి, బారువ , భీమిలి బీచ్ లను అభివృద్ధి చేసి... పర్యాటకులు సేద తీరేందుకు అనువుగా మరల్చాలి.


    .ఇచ్చాపురం, ఉద్ధానం ప్రాంతాల్లో మొగలిపువ్వులు విస్తారంగా విరబూస్తాయి... అయితే దీన్నో పంటగా ఎవరూ చూడరు. సెలయేళ్లు పక్కన ఇవి పెరుగుతాయి... కొబ్బరి చెట్లకు కంచెలా రైతులు మొగలి డొంకలను పెంచుతారు. ఒడిశాలో వీటి నుంచి అత్తరు, ఇతర ఔషధాలను తీసే బట్టీలున్నాయి. మన దగ్గర ఒక్కటీ లేదు. ఒడిశాలో ఇదో పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ఒక్క లీటర్ మొగలి అత్తరు లక్షల్లో విక్రయిస్తారు... అగరు బత్తీల నుంచి ఔషాధాల తయారీ వరకు వీటిని ఉపయోగిస్తారు. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చి దిద్దొచ్చు. 


    .ఉత్తరాంధ్రతోపాటు... రాష్ట్రానికున్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మెరైన్ డ్రైవ్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి కొనసాగుతుంది. దీనివలన తీర ప్రాంతమంతా జెట్ స్పీడ్ లో అభివృద్ధి చెందుతుంది. ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా ... నెత్తురు మండే, శక్తులు నిండే యువకులారా  రారండి  అన్నారు ఈ ప్రాంతానికే చెందిన శ్రీశ్రీ.  ఆయన మాటలే స్ఫూర్తిగా ఉత్తరాంధ్రను అభివృద్ధి బాట పట్టిద్దాం.