అధికార లాంఛనాలతోఎంపి బల్లి దుర్గా ప్రసాద్ అంత్యక్రియలు


      తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ అంత్యక్రియలు స్వస్థలం నెల్లూరుజిల్లాలోని వెంకటగిరిలో గురువారం జరిగాయి. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం చెన్నైలోని అపోలో హాస్పిటల్ బల్లి దుర్గా ప్రసాద్ కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన పార్ధీవ దేహాన్ని వెంకటగిరికి తీసుకొచ్చారు. పలువురు ఆయన పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు.నెల్లూరుజిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి,తిరుపలి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య,జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, స్థానిక నేతలు, అధికారులు దుర్గా ప్రసాద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


 బల్లి దుర్గాప్రసాద్ రావు గారి  సంతాప సభలో పాల్గొన్నఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి 



    నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ రావు గారి మృతి పట్ల ఏర్పాటుచేసిన సంతాప సభలో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, తన సంతాపాన్ని తెలియజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. నిగర్వి, నిరాడంబరుడు, నిత్య శ్రామికుడు, ప్రజా సేవకుడు బల్లి దుర్గా ప్రసాదరావు గారి మరణం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి తీరని లోటు..


     న్యాయవాద వృత్తిని చేపట్టి, ప్రజాజీవితంలో అడుగు వేసి, రాజకీయాలలో అంచెలు అంచెలుగా ఎదిగి, నాలుగు దఫాలు శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంట్ సభ్యునిగా తన సంపూర్ణ సహాయ సహకారాలు అందించి, నియోజకవర్గ ప్రజలలో అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగారు.బల్లి దుర్గా ప్రసాద్ గారు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంటులో అడుగు పెట్టి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద జాతీయ స్థాయిలో తన గళం విప్పి, పరిష్కార మార్గం చూపించగలరని ప్రజలు ఆశిస్తున్న సందర్భంలో ఆయన ఆకస్మికంగా మన అందరిని వదిలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరం.


బల్లి దుర్గాప్రసాదరావు గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, భగవంతుని ప్రార్ధిస్తూ, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.