(స్ప్రెడ్ న్యూస్ ) అమరావతి;-రాష్ట్రంలోచేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు.ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలని కోరారు.రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం శ్రీ వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.
చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ఆయన, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.అందువల్ల రైతులకు అవగాహన కల్పించాలని, వారికి నచ్చచెప్పాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.జెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్దేశించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.