(స్ప్రెడ్ న్యూస్ ) సచివాలయం;- రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్మించతలపెట్టిన గుర్రం జాషువా కళాప్రాంగణం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణంపై సచివాలయంలోని మంత్రి చాంబర్లో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు లతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాకవి గుర్రం జాషువా కళా ప్రాంగణానికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు.
దీనికి అవసరమైన 25 సెంట్ల స్థలాన్ని గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈనెల 28న గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఇప్పటికే గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో 125 వ జయంతి ఉత్సవాలు వారం రోజులపాటు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయన జయంతి రోజున కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కళాప్రాంగణం నిర్మాణానికి అధికారులు రూపొందించిన డిజైన్లను పరిశీలించి తుది రూపు తీసుకువచ్చిన తరువాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
గుంటూరులో రాష్ట్రానికే తలమానికంగా ఈ కళాప్రాంగణం నిర్మించతలపెట్టామని అందులో అన్ని హంగులతో కాన్ఫరెన్స్ హల్, డైనింగ్ హాల్ ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఆర్థిక వనరులకోసం ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా కళాప్రాంగణం నిర్వహణ కోసం అవసరమైన నిధుల సమీకరణ తదితర అంశాలపై సమీక్షించారు.రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడం గుంటూరులో జాషువా కళా ప్రాంగణానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని అన్నారు. మహాకవి గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణంలో తాను కూడా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కల్చరల్ సీఈ సి ఎస్ ఎన్ మూర్తి, గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.