(స్ప్రెడ్ న్యూస్ ) అమరావతి ;- రాష్ట్రంలో ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రతినిధులతో చర్చిస్తున్నామని గౌతమ్ రెడ్డి తెలిపారు. యాపిల్ ఏర్పాటుకు అవసరమైన వాతావరణం, ఏఏ ప్రాధాన్యతలు కావాలో తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. యాపిల్ కోసం కడప విమానాశ్రయాన్ని పూర్తిగా కార్గో హబ్ గా చేయడానికీ సిద్ధమని తెలిపారు. స్టార్టప్ కు అవసరమైన నిబంధనలకు సంబంధించి ఏపీకి అవార్డు రావడం హర్షణీయమన్నారు. అదే ఉత్సాహంతో ఏపీని స్టార్టప్ కల్చర్ కి మరింత అనుకూల వాతావరణంగా మారుస్తామన్నారు.
జీ పాన్ బాక్సుల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం జరిగిందని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2వేలకు మించి ధర లేని సెట్ టాప్ బాక్స్ లను.. తెలుగుదేశం హయాంలో రూ.4,400గా కోట్ చేసినట్లు మంత్రి పునరుద్ఘాటించారు. కొనుగోలు వ్యవహారంలో కనీస విధివిధానాలు పాటించలేదన్నారు. కాంట్రాక్టులు, కొనుగోళ్లు మొదలు 24 వేల కిలోమీటర్లు వేసిన కేబుల్ ప్రక్రియ సైతం ఇష్టారీతిన అక్రమాలతో సాగిందని మండిపడ్డారు. కానీ చివరకు చైనా నుంచి తక్కువ ధరకు కొన్న నాణ్యతలేని కేబుల్ ను ఉపయోగించినట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్ కేబుల్ నాణ్యతలోనూ మార్గదర్శకాలను పాటించలేదన్నారు. 60శాతం ఉపయోగించిన కేబుల్ నాన్ ఐఎస్ఓ కోడెడ్ తరహాది కాగా.. ఇందులో నూటికి 100శాతం దోపిడీ, అవినీతి జరిగాయన్నారు. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లు చేసిన 10 లక్షల బాక్సులలో.. 2 లక్షలు పనిచేయడం లేదన్నారు. ప్రజాధనం వృథా కాకూడదనే ఉద్దేశంతో దీనిపై నిష్పక్షపాతంగా సీబీఐ విచారణకు ఆదేశించామన్నారు. తప్పు చేయనపుడు రాజధాని భూములపై విచారణకు తెలుగుదేశం పార్టీ ఎందుకు వెనకడుగు వేస్తుందో ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాలని గౌతమ్ రెడ్డి తనదైనశైలిలో ప్రశ్నించారు.