జర్నలిస్టులకు ఆన్ లైన్ శిక్షణా తరగతులు


     spread news;-  విశాఖపట్నం, సెప్టెంబరు 26 : నిరంతరం నైపుణ్యాలను పెంచుకుంటూ, నిత్య విద్యార్థి గా వున్నవారు వారిరంగాలలో రాణిస్తారని రాష్ట్ర సమాచార మరియు రవాణాశాఖా మాత్యులు పేర్ని వెంకటరామయ్య తెలిపారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ అకాడమీ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులను, శిక్షణ ఇస్తున్న సీనియర్ పాత్రికేయలు జి.వల్లీశ్వర్, ఉమామహేశ్వరరావులను అభినందించారు.


      ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ఏర్పాటు, గ్రామీణ విలేఖరులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, రాజకీయాలు – మీడియా  సంబంధాలు తదితర విషయాలను వివరించారు. పాఠకులకు అవసరమైన సమాచారాన్ని క్లుప్తంగా అందించడం, విలేఖరులు అలవాటు చేసుకోవాలన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేర్చుకొని పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు, జర్నలిస్టులు వారధి లాంటి వారని, వారికి వృత్తిపరంగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. 


   జర్నలిస్టులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా  స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమంలో అన్నిఅంశాల పైన క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తాయని వాటిలో కొన్ని అవాస్తవాలు వుంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చొరవ తీసుకొని ఆన్ లైన్ లో శిక్షణా కార్యక్రమాన్ని విశాఖపట్నం ద్వారా ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేసారు.ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ జర్నలిజంలోని మెళుకువలు నేర్చుకోవాలని, మరింత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఆసక్తి ఉన్న జర్నలిస్టులకు జర్నలిజం రంగంపై శిక్షణను అందించేందుకు,  ప్రెస్ అకాడమీ చొరవ చూపుతున్నదని తెలిపారు.


    శిక్షణ శాస్త్రీయంగా వుండాలనే ధ్యేయంతో ఈరంగంలో నిష్ణాతులైన జర్నలిస్టులు, ప్రముఖులు ఆయా అంశాలపై బోధిస్తారన్నారు.అనంతరం  వార్తలు సేకరించడంలో మెళుకువులు, వార్తల్ని పసిగట్టడం ఎలా అనే అంశంపై జి.వల్లీశ్వరి, వార్తల రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉమామహేశ్వరరావు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాన్ని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే సమన్వయం చేశారు.విశాఖపట్నం  జిల్లా జర్నలిస్టులు జూమ్ విధానంలో ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.