జ‌గ‌న్‌కు కేసీఆర్ ద‌న్ను


     spread news;- నిన్న రాత్రి 9 గంట‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున ఎంతో ముఖ్య‌మైన ప్రెస్‌మీట్ జరిగింది. అంత‌కు ముందు ఈ విష‌య‌మై వివిధ చాన‌ళ్ల‌లో బ్రేకింగ్ న్యూస్‌గా ఊద‌ర‌గొట్టారు. తీరా ప్రెస్‌మీట్ స్టార్ట్ అయిన త‌ర్వాత ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌కుండా నిమ్మ‌కుండి పోయాయి.టీడీపీ అనుకూల చాన‌ళ్లు ఎటూ ఆ ప్రెస్‌మీట్‌ను ప‌ట్టించుకోలేదు. ప‌ట్టించుకోవ‌ని కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ జ‌గ‌న్ స‌ర్కార్‌తో స‌ఖ్య‌త‌గా మెలుగుతాయ‌ని పేరున్న చాన‌ళ్లు కూడా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి భ‌య‌ప‌డ్డాయి.


     సుప్రీంకోర్టు జ‌డ్జితో పాటు హైకోర్టు జ‌డ్జీల‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్ కావ‌డంతో ... ఎందుకొచ్చిన గొడ‌వ‌ని ఎవ‌రికి వాళ్లు స‌ర్దుకున్నారు.ఈ నేప‌థ్యంలో తెల్లారి చూస్తే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్‌కు సంబంధించిన స‌మాచారమే లేదు. అలాగే ఈ రెండు ప‌త్రిక‌లను సీపీఐ అనుబంధ ప‌త్రిక విశాలాంధ్ర ప‌త్రిక అనుస‌రించి వార్త‌ను కిల్ చేయ‌డం ఆత్మ‌హ‌త్యాస‌దృశ్యంగా చెప్పొచ్చు. చంద్ర‌బాబుతో బంధం సీపీఐని ఎలాంటి దుస్థితికి దిగ‌జార్చిందో ఇదే నిద‌ర్శ‌నంగా నిలిచింది.


    సాక్షితో పాటు ప్ర‌జాశ‌క్తి, ఆంధ్ర‌ప్ర‌భ త‌దిత‌ర ప‌త్రిక‌లు ఈ వార్త‌ను ఇవ్వ‌డం నిజంగా అభినంద‌నీయం. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ న్యాయ పోరాటానికి అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెన్నుద‌న్నుగా నిలిచారు. టీఆర్ఎస్ సొంత ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్‌కు అగ్ర‌స్థానం క‌ల్పించ‌డం ద్వారా ,ఈ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌కు కేసీఆర్ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని స్ప‌ష్ట‌మైంది.


"న్యాయ పోరాటం" శీర్షిక‌తో న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో బ్యాన‌ర్ వార్త ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సాక్షి కంటే మిన్న‌గా న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో వార్తా కథ‌నాన్ని హైలెట్ చేశారు. ఈ క‌థ‌నానికి న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇచ్చిన స‌బ్ హెడ్డింగ్‌లు, జ‌గ‌న్ లేఖ‌లోని ముఖ్యాంశాల‌ను ప్ర‌ధానంగా ఇవ్వ‌డాన్ని బ‌ట్టి ,కేసీఆర్ వైఖ‌రి ఏంటో మ‌రోసారి రుజువైంది.