‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’లో పాల్గొన్న సీఎం జగన్


     spreadnews(విజయవాడ);- పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి ఆతర్వాత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. పోలీసులపై రచించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.ఈరోజు పోలీసు అమర వీరులను దేశం యావత్తూ స్మరించుకునే రోజు అన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, పోలీసుల త్యాగాలను 61 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసుకు, ఆ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుందని ఆయన పేర్కొన్నారు.



    పోలీసుల క్యాప్‌పై నాలుగు సింహాలు ఉంటాయని, నాలుగు వైపుల నుంచి ఏ ఆపద వచ్చినా కాపాడతారన్న నమ్మకానికి అవి నిదర్శనమని చెప్పారు. సారనాథ్‌ స్థూపం నుంచి తీసుకున్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యం.. అధికారం అనేది ఎంతటి బాధ్యతో చెబుతుందన్నారు. ఒక దేశం అభివృద్ధికి సూచిక తలసరి ఆదాయం అని చెబుతారన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, కానీ దానికి మించిన ఇండికేటర్‌ నేరాల సంఖ్య తక్కువగా ఉండడం అని పేర్కొన్నారు. అందుకే ఫిన్‌ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయన్న ఆయన, మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండడం కూడా ఒక ప్రమాణం అని చెప్పారు.



    అయితే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితి రాత్రికి రాత్రి వస్తుందని అనుకోవడం లేదంటూ, అయినా క్రైమ్‌ రేటు తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.శాంతి భద్రతలు అనేది మన ప్రభుత్వంలో టాప్‌మోస్ట్‌ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో, మొత్తం మీద పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో పోలీసులు ఏ మాత్రం రాజీ పడొద్దు.


ఇక్కడే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. పోలీసుల కష్టం నాకు తెలుసు. ఈ కోవిడ్‌ సమయంలో గ్రామ, వార్డు సచివాలయాలు మొదలు పోలీసులు విధి నిర్వహణలో, రాష్ట్ర డీజీపీ వరకు ఏ స్థాయిలో పని చేశారన్నది మనందరికీ తెలిసిన విషయమే. మనం అందరం కూడా చూశాం. ఇందులో అసువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉండే పోలీసు సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, ఎండనక వాననక, రాత్రనక, పగలనక ఎంత కష్టపడతారో నాకు తెలుసు.