మన నెల్లూరు నాణ్యమైన సేవలలో నెంబర్ ఒన్


          స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు);-  కరోనా సమయంలో రోగులకు నాణ్యమైన సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మొదటి ర్యాంకు ప్రకడించడంపై, సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు జిల్లాలోనే నమోదైందని,జులై నుంచి సెప్టెంబర్ వరకూ జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదయయ్యాయని, పాజిటివ్ కేసుల రేట్ 20 నుంచి 30 శాతం వరకూ ఉందని, అలాంటి పరిస్థితిని ప్రభుత్వం, రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ మేకపాటి గౌతం రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో, జిల్లా యంత్రాంగం అహర్శిశలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిందన్నారు.


    ఆ కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు కరోనా రోగులకు నాణ్యమైన సేవలందిచడంలో నంబర్ 1 స్థానాన్ని ఇచ్చిందన్నారు. ఈ ర్యాంకు రావడాన్ని ఓ బాధ్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించడానికి కంకణ బద్ధలమయ్యామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 7 సంజీవని బస్సులను కేటాయించారని, 3 ఆర్.టి.పి.సి ఆర్ ల్యాబులు ఏర్పాటుకు సహకరించారన్నారు. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రోజుకు 1000 టెస్టులు చేసే పరిస్థితి నుంచి 7,500 పరీక్షలు చేసేలా స్థాయికి వెళ్లామన్నారు. 24 గంటల్లో వ్యాధి నిర్థారణ ఫలితం ప్రకటిస్తూ, పాజిటివ్ వ్యక్తులను ఆస్పత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించి మెరుగైన చికిత్స అందించామన్నారు.


    వృద్ధులను ఆస్పత్రులకు తరలించడంలో ప్రాధాన్యం ఇవ్వడం వలన మరణాలు రేటు తగ్గించామని, కోవిడ్ ఆస్పత్రుల్లో స్పెషల్ వైద్యులతో పాటు, అన్ని విభాగాల్లో సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యం అందించామన్నారు. ప్రాంతీయ కోవిడ్ కేంద్రం జి.జి.హెచ్. నందు 10,000 లీటర్ల ఆక్సిజన్ అందించే ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. 750 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. సీఎం శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఆళ్ల నానిగారి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.