కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను ఐ.టీ రంగంలో అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు విజయవాడ వేదికగా ఐ.టీ సంస్థల సీఈవోలతో ఏప్రిల్ 2న రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని ఐ.టీ సమావేశ మందిరంలో బుధవారం మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఐ.టీ సంస్థలకు చెల్లించవలసిన బకాయిల గురించి ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి ప్రధానంగా చర్చించారు.
ఐ.టీ సంస్థలకు ఇవ్వవలసిన పెండింగ్ ఇన్సెంటివ్స్ లో మంజూరు కావలసిన క్లెయిమ్ లు, విడుదల చేయవలసినవాటి వివరాలను మంత్రి మేకపాటి ఆరా తీశారు.2018 నుంచి 2021 వరకూ ఏపీఈఐటీఏ పరిధిలో ఉన్న ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ.21.18 కోట్లుగా ఉన్నట్లు ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్ లకు రూ.49 కోట్లు బకాయిలున్నాయని మంత్రి మేకపాటికి ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ వివరించారు. అది కాకుండా గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్ లకు మరో 11 కోట్లుగా ఉన్నట్లు ఆయన మంత్రి మేకపాటి దృష్టికి తీసుకువెళ్లారు.
ఐ.టీ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఐ.టీ సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలతో జరిగే ఈ సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైపుణ్యం, ఉపాధి, కాన్సెప్ట్ సిటీలు, ఇంటర్నెట్ లైబ్రరీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఐ.టీ రంగంలో కరోనా ప్రభావం చూపని విధంగా వినూత్నమైన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.