సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వుండాలనిఅన్నారు. వైద్యం, విద్యా రంగాల్లో నాడు - నేడు కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది: సీఎం శ్రీ వైయస్.జగన్. నాడు - నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. భూ సేకరణలోకాని, ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి. అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందాం.
అలాగే ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలి. ఆ తరహా నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. దీనికోసం ఎస్‌ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలి.
మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీకూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలి. బెడ్‌షీట్ల దగ్గరనుంచి, శానిటేషన్ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలి. పేషెంట్‌కు ఇచ్చిన గది, పడక దీంతోపాటు ఆస్పత్రి వాతావరణం, అలాగే రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలి. ఆస్పత్రిలో పరికరాలు పనిచేయట్లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దు .