SPREAD NEWS(AMRAVATEY);- కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి చిన్నారి పేరున రూ.10 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోందని, కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే దీనికి నిదర్శమని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రోజుకు 50 వేల మందికి టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గడిచిన 24 గంటల్లో 73,749 కరోనా టెస్టులు నిర్వహించగా, 18,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 109 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,421 ఐసీయూ బెడ్లు, ఉండగా, వాటిలో 6,058 రోగులతో నిండి ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,393 ఉండగా, 22,960 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో 4,551 మంది డిశ్చార్జి కాగా, 6,884 మంది కరోనాతో పలు ఆసుపత్రుల్లో చేరారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 17,340 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు 22,882 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందజేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు 19,746 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. గడిచిన 24 గంటల్లో 600 టన్నుల ఆక్సిజన్ ను రాష్ట్ర అవసరాలకు వినియోగించామన్నారు.
రాష్ట్రంలో 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ వైద్య సేవలు అందిచేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 91 వేల మంది జ్వరపీడుతులను గుర్తించామన్నారు. జ్వరపీడితులకు టెస్టుల చేయడంతో పాటు హోం ఐసోలేషన్లు కిట్లు ఇస్తామన్నారు. ప్రతి ఒక్క కేసు గురించి క్షుణ్నంగా ఆరా తీస్తున్నామన్నారు. అంబులెన్స్ లు అందుబాటులో పెట్టి, అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.