SPREAD NEWS;- పార్లమెంట్ లో వైసిపి సృష్టిస్తున్న హంగామా ఒకటిరెండు రోజుల్లో సమసిపోతుందని ఆశించిన బీజేపీకి ఆశాభంగమే ఎదురైంది. ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి పదునైన బాణాలవంటి విమర్శలతో రాజ్యసభను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం చూసి ప్రధానమంత్రి సైతం ఆశ్చర్యపోవాల్సి వస్తున్నది. ప్రధానమంత్రి ముందే విజయసాయిరెడ్డి చెలరేగిపోవడం చూసి బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
నిన్నటిదాకా తమకు అత్యంత విధేయులు అని మోడీ నమ్మిన వైసిపి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ ఉక్కు పరిరక్షణ, రఘురామరాజు అనర్హత పిటీషన్ మొదలైన అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని వైసిపి ఎంపీలు ఇరుకునపెట్టదాన్ని కేంద్ర పెద్దలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమతో ఎంతో సన్నిహితంగా ఉండే విజయసాయిరెడ్డి వీరవిహారాన్ని అర్ధం చేసుకోవడం కేంద్రం తరం కావడం లేదు.
రఘురామరాజు అనర్హత పిటీషన్ విషయం మీద విజయసాయిరెడ్డి నేతృత్వంలో సభను స్తంభింపజెయ్యడమే కాకుండా నేరుగా సభాపతి ఓం బిర్లా మీదనే నిర్మొగమాటంగా పక్షపాత ప్రవర్తన అంటూ విల్లు ఎక్కుపెట్టడం, రాజుగారిని ఇండియా దాటి వెళ్లకుండా చూడాలని ప్రధానికి, రాష్ట్రపతికి కూడా ఆయన లేఖలు రాయడం పెనుసంచలనం కల్గించడమే కాక, దేశంలోని రాజకీయపక్షాలు సైతం బిత్తరపోవడంతో కేంద్రపెద్దలు వైసీపీతో సంధిప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.
ఈ నెలాఖరులోగా ఢిల్లీలో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అమిత్ షా కోరినట్లు సమాచారం. రాష్ట్రానికి ఏ విధంగానూ సాయం చెయ్యకుండా తమను చిన్నచూపు చూస్తున్న బీజేపీ పట్ల జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా జగన్ ఢిల్లీ వెళ్తే కొన్ని సంచలనాలు తప్పవు.