పుట్టినగడ్డకు బాబు'వెన్నుపోటా?

     


SPREAD NEWS(అమరావతి);-చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వాయర్లపై పార్టీ నేతలతో చంద్రబాబు పిటిషన్లు,పనులు నిలిపివేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీలో పిటిషన్.కేంద్ర జలసంఘం, జలశక్తి శాఖకు కూడా ఫిర్యాదు.ఆ రిజర్వాయర్లు పూర్తయితే 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం.

     తాను జన్మించిన ప్రాంతమంటే సహజంగానే ఎవరికైనా కాస్తంత ప్రేమ ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా ఆ మమకారం పోదు. వీలైతే సొంతగడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. పోనీ అది కుదరలేదనుకుంటే కనీసం అపకారం తలపెట్టకూడదు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధినే అడ్డుకుంటున్నారు. తాను చేయకపోగా ఇతరులు సంకల్పిస్తే సహించలేకపోతున్నారు. లక్ష ఎకరాలకుపైగా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తాజాగా ఎన్జీటీలో ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషనే ఇందుకు నిదర్శనం.

ప్రాజెక్టును ఆపాలంటూ టీడీపీ పిటిషన్‌..

    గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రిజర్వాయర్లతో కూడిన ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు ఆ పార్టీకే చెందిన 13 మంది నేతలతో జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ), చెన్నై బెంచ్‌లో చంద్రబాబు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీని అభ్యర్థించారు.

    కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్‌ శక్తి శాఖకూ ఫిర్యాదులు చేశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలని ఎన్జీటీలో గత నెల 27న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు జిల్లాలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.