SPREAD NEWS;- నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం! 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి, మొత్తంగా 140 కోట్ల భారతీయులకు... నిండు మనసుతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.ఒక దేశాన్ని మరో దేశం... ఒక జాతిని మరో జాతీ... ఒక మనిషిని మరో మనిషీ దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారు.స్వతంత్ర దేశంగా గడచిన 74 సంవత్సరాల్లో... భారతీయులుగా, భారత దేశంగా మనం ఏం సాధించాం అని... మన ప్రగతిని–మన వెనుకబాటును, జరిగిన మంచిని–చెడుని మన దేశం చర్చిస్తున్న సమయం ఇది! ఈ చర్చ జరగాలి.
లోపాలను సరిదిద్దుకొనేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఈ రోజు ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి.74 ఏళ్ళ క్రితం, 1947 ఆగస్టు 15న కోరుకున్నది– మనను మనం పరిపాలించుకునే స్వాతంత్య్రం అయితే... ఇప్పుడు ప్రజలంతా, మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కుల్ని, రక్షణల్ని, స్వాతంత్య్రాలను కచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు.
హక్కుల ప్రకటనకు– హక్కుల అమలుకు మధ్య ఉన్న ఈ తేడాను తగ్గిస్తూ, ఈ తేడాను చెరిపేసేందుకు గత 26 నెలలుగా ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటీ చేశాం.వివిధ వర్గాలు ఏం కోరుకుంటున్నాయన్నది నా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశాను.మన రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారు.మన అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరింత సాధికారత ఇవ్వాలని కోరుకున్నారు.రైట్ టూ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు... రైట్ టూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా ఉండాలని కోరుకున్నారు. ఎటువంటి వ్యాధికి అయినా వైద్యాన్ని ఒక హక్కుగా పేదలకు–దిగువ మధ్య తరగతికి ఇవ్వగలగాలని కోరుకున్నారు.