SPREAD NEWS( నెల్లూరు);-ఎందరో కవులు, కళాకారులకు పుట్టినిల్లు నెల్లూరు గడ్డ అని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా ప్రయోగాలు, పరిశోధనలు అనే అంశంపై జాతీయ సదస్సును ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం అన్ని విశ్వవిద్యాలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
భాషా చైతన్య యాత్రల పేరుతో రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలను సందర్శిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, రచయితలను సత్కరిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఐదో స్థానంలో ఉందని, మన దేశంలో మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. అయితే యునెస్కో ప్రకటించిన జాబితాలో తెలుగు భాష అట్టడుగు స్థాయికి చేరడం బాధాకరమైన విషయమన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే తెలుగు భాషకు ఈ దుర్గతి పట్టిందన్నారు. ప్రస్తుతం తెలుగు అకాడమికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని లక్ష్మీ పార్వతి చెప్పారు. మాతృభాష అనేది మన రక్తంలో కలిసి ఉంటుందని, మాతృభాషను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అన్నారు. శాసనాల ద్వారా తెలుగు భాష ఉనికి వెలుగులోకి వచ్చిందని, 8వ శతాబ్దం అంతంలో తెలుగు లిపి గుర్తించబడిందని, 11వ శతాబ్దంలో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన సోమయాజి వంటి మహాకవులు భాషా రూపాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించారన్నారు.
తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మాతృభాష గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. ఆంగ్ల భాష అవసరం కూడా ప్రస్తుతం వివిధ ఉద్యోగాల రీత్యా తప్పనిసరిగా మారిందని, అందుకే పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. తెలుగు అకాడమికి సొంత భవనాన్ని నిర్మించాలన్నది తన లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి సహకారంతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. తదుపరి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపకులు లక్ష్మీపార్వతిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రెక్టార్ చంద్రయ్య, రిజిస్ట్రార్ ఎల్. విజయకృష్ణరెడ్డి, తెలుగు శాఖ ఇన్చార్జ్ అధ్యక్షులు డాక్టర్ పి సుబ్బరాజు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, విఎస్ యు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కిరణ్మయి, మధుమతి, సునీత, మణికంఠ, ఉదయశంకర్ అల్లం, రచయితలు పాతూరి అన్నపూర్ణ, గంగి శెట్టి శివకుమార్, చిన్ని నారాయణరావు, రాచపాలెం రఘు తదితరులు పాల్గొన్నారు.