SPREAD NEWS;- పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ జరగనంత వాడిగా, వేడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2021 ఎన్నికలు జరిగాయి. పోలింగ్ డేట్ అయిన అక్టోబర్ 10కి ఒక రోజు ముందు దాకా ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మెంబర్స్, మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. ఇండస్ట్రీకి పెద్దదిక్కు అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ గొడవనంతా మౌనంగా తిలకిస్తూ వచ్చారు. ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు సపోర్టర్ నరేశ్ తీవ్రస్థాయిలో మాటల దాడి చేసినప్పుడు ఆయన నోరు మెదపలేదు. తన పెద్దతమ్ముడు నాగబాబు ప్రకాశ్‌రాజ్‌ను కీర్తిస్తూ, విష్ణునే కాకుండా తెలుగు నటులందర్నీ చులకన చేసి మాట్లాడినప్పుడు, పెద్దవారైన కోట శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడూ మౌనం వహించారు.
ఆయన మౌనం చూసి, చాలామంది అసంతృప్తికి గురయ్యారు. ఇండస్ట్రీ పెద్దగా బాధ్యత తీసుకొని, ఎవరూ ఇతరులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దనీ, 'మా' పరువు బజారుకు ఈడ్చవద్దనీ గట్టిగా చెప్పినట్లయితే.. నరేశ్ కానీ, నాగబాబు కానీ ఈ రేంజ్‌లో దూషణలకు పాల్పడేవారు కాదు. కానీ చిరంజీవి ఆ పని చేయలేదు. తీరా ఎన్నికలు అయ్యాక.. మంచు విష్ణు ప్యానల్ విజయం సాధిస్తోందనే వార్తలు వచ్చాక, అదే రోజు రాత్రి జరిగిన 'పెళ్లి సందడి' ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన 'మా' ఎన్నికలను నేరుగా ప్రస్తావించకుండా, ఇన్‌డైరెక్టుగా ఆ గొడవలను ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగానే గొడవలంటే చిరంజీవికి గిట్టవు. వాటికి ఆయన దూరంగా ఉంటారు. అందరితోనూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం ఇండస్ట్రీలోని వారందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీలోని గొడవల గురించి ఆయన ప్రస్తావించిన వేదిక, సందర్భంపై చాలామంది సంతోషంగా లేరు.( PART 2)