SPREAD NEWS;- ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటికప్పడు తమ కోరిక బయట పెట్టుకొంటూ ఉంటారు. అయితే నిజానికి ఆయన అయితే ఎప్పుడూ రాజకీయాలపై ప్రత్యక్షంగా మాట్లాడలేదు కానీ ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటూ ఉంటారు. అయితే రాజకీయంగా తెలుగు దేశం పార్టీతో సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నారు. అయితే కుప్పం మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశానికి ఎన్టీఆర్ అభిమానులు షాకిచ్చారు. కుప్పం మునిసిపాలిటీ పరిధిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బహిరంగ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలలో ఆత్మభిమానం గల అభిమానులుగా మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విన్నపం అంటూ మొదలు పెట్టి టీడీపీ గురించి సంచలన అంశాలు బయట పెట్టారు.
గత రెండు సంవత్సరాలుగా కుప్పం గడ్డమీద అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ప్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడనీ, నారా లోకేష్ కూడా మన అన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడకుండా రెండు సార్లు మనపై దాడి చేయించాడని, ఇప్పుడు గాయపడ్డ ప్రతి జూనియర్ అభిమానికి సమయం వచ్చింది.. దెబ్బకు లోకేష్ పర్యటించిన అన్ని వార్డులు ఓటమి పాలు చేసి మన ప్రతీకారం రుచి వాళ్ళకు చూపిద్దామని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిమాని అనే వాడు దెబ్బ తినడమే కాదు, తన సమయం వస్తే జీవితంలో లేవనంత దెబ్బ కొట్టగలడు అని చూపిద్దామని లేఖలో పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఒక రాజకీయ పార్టీ నేపథ్యంలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. తాత ఎన్టీఆర్ పోలికలతో ఉన్న ఆయన ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే చారిష్మా ఉంది..అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున 2009లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు సేవలందిస్తానని కూడా ప్రకటించారు. బాబు నాయకత్వంలో చేవ చచ్చిన టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు